gorrey sheep katha telugu lo stories kathalu పీటర్ గొర్రె కథ

Blogger Passion
By -
0
gorrey sheep katha telugu lo stories kathalu పీటర్ గొర్రె కథ
పీటర్ గొర్రె కథ:---
ఆల్ప్సు మంచుకొండల్లో చాలా కాలం క్రితం పీటర్ అనే కొండగొర్రె ఒకటి ఉండేది. కొండలపైన, ఎగుడు దిగుడు నేలమీద, నిటారుగా జారే వాలుల మీద పీటర్ చాలా చాకచక్యంగా తిరుగుతుండేది. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో దుబ్బలు దుబ్బలుగా పెరిగే పచ్చగడ్డి, అది ఎంత తిన్నా తరిగేది కాదు. అయితే, దాన్ని సంపాదించుకునేందుకు మాత్రం పీటర్ చాలా శ్రమ పడాల్సి వచ్చేది. అలా తిరిగీ తిరిగీ పీటర్ శరీరం గట్టిగా, బలంగా తయారైంది.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

అయితే, పెరుగుతున్న కొద్దీ పీటర్‌కు మునుపెన్నడూ లేని సమస్య ఒకటి ఎదురైంది: దాని కొమ్ములు ఆగకుండా పెరుగుతూ పోయాయి. కొంచెం ముందుకు- మళ్ళీ క్రిందికి- మళ్లీ దాని ముందుకాళ్ల సందులోంచి, వెనక్కి- అటునుండి వెనక కాళ్ల సందుల్లోంచి బయటికి- అట్లా పెరుగుతూనే పోయాయి. చివరికి అవి పీటర్‌ను దాటి, దాని వెనకవైపున ఒక అడుగు పొడవు పెరిగాక గానీ ఆగలేదు! ఇంత పొడుగు కొమ్ములతో పీటర్‌కు మేత వెతుక్కోవటంకూడా కష్టమైంది. రాళ్ల సందుల్లోను, చెట్లు-తుప్పలలోను తరచు దాని కొమ్ములు ఇరుక్కునేవి. అలాంటి సందర్భాల్లో అది గనక క్రిందికి జారి ఉంటే చాలా ప్రమాదాలు సంభవించి ఉండేవి- కానీ అది చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నది గనక సరిపోయింది. ఒక్కోసారి, దానికి ఆకలేసి ఎక్కువెక్కువ గడ్డి తినాలని ఉన్నప్పుడు, దాని కొమ్ములే దాని నోటికి అడ్డం వచ్చేవి!
రాను రాను పీటర్‌కు పర్వతాగ్రాల మీద బ్రతకటం కష్టమైంది. చుట్టూతా గడ్డి ఉన్నా, అందుకొని తినలేని పరిస్థితి దానిది, పాపం! అందుకని, ఒకరోజున అది కొండల దిగువన ఉండే మైదాన ప్రదేశంలో తనకు ఏమైనా అచ్చి వస్తుందేమో చూసేందుకని బయలుదేరి పోయింది.
మైదానంలో జడల బర్రెలు మందలు మందలుగా తిరుగుతున్నై. వింత కొమ్ములు పెట్టుకొని, తమ మధ్యలోకి ఊడిపడిన ఒంటరి గొర్రెను చూసి, మొదట్లో అవి చాలా కోపగించుకున్నాయి. తమ ప్రాంతంలోకి ఇతరులు ప్రవేశించటం వాటికి ఏనాడూ నచ్చలేదు; వాటిలో బలమైనవి కొన్ని పీటర్‌ను చుట్టుముట్టి, ఎటూ కదలనివ్వక, తమ వాడి కొమ్ములతో పొడిచేందుకు కాలు దువ్వసాగాయి.
పీటర్ వాటి పెద్దరికాన్ని గౌరవించింది- ఎంతో మర్యాదగా, గౌరవంగా, తన కొచ్చిన కష్టాన్ని వివరించింది వాటికి. కొంతసేపటికి వాటికి సమస్య అర్థమై, అవి పీటర్‌ను తమ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాయి. గుంపు పెద్దలు కొంచెం ఆలోచించాక, పీటర్‌ని తమతోబాటు ఉంచుకు-నేందుకు ఒప్పుకున్నాయి. పీటర్ సంరక్షణ బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నాయి అవి! అటు తర్వాత పీటర్ అంతే వయసున్న జడల బర్రెలు కొన్ని దానితో స్నేహం చేశాయి. రోజూ అవన్నీ కలిసి తమవైన ఆటలూ ఆడుకోవటం మొదలుపెట్టాయి. పీటర్‌కూ వాటి సహచర్యమూ, ఆటలూ ఎంతో నచ్చాయి.
అయితే, ఆ సరికే వేటగాళ్ళు కొందరి దృష్టిలో పడి ఉన్నది పీటర్. వాళ్ళు దానికోసం మంచుకొండల పైన అంతా వెతికారు. అయితే ఇప్పుడు అది అక్కడ లేకపోయేసరికి, వాళ్లకు అనుమానం వచ్చి, మైదానాల్లో జడల బర్రెల గుంపుల్లో వెతకటం మొదలుపెట్టారు. పీటర్‌కున్న పొడవాటి కొమ్ముల్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని వాళ్లు ఆశ పడ్డారు. కానీ వాళ్లెప్పుడు వచ్చినా, జడల బర్రెలన్నీ పీటర్‌ చుట్టూ మూగి, అది వాళ్ల కంటపడకుండా కమ్ముకొని, కాపాడటం మొదలుపెట్టాయి. అయినా పీటర్ వాళ్ల కంట పడనే పడింది. ఇప్పుడు వాళ్ళు 'జడల బర్రెల రక్షణ వలయాన్ని ఎలా ఛేదించాలా' అని పధకాలు వేయటం మొదలుపెట్టారు. వాళ్లలో ఒకడైతే ఏకంగా ఒక హెలికాప్టర్‌నే తెచ్చుకొని ఆకాశంనుండి గొర్రెను కాల్చేందుకు ప్రయత్నించాడు!
ఇక పీటర్‌ను తమతోబాటు ఉంచుకోవటం సాధ్యం కాదని గ్రహించాయి జడల బర్రెలు. వేటాడే మనుషులనుండి దాన్ని కాపాడేంత శక్తి లేదు వాటికి. చివరికి అవి పీటర్‌కు సలహా ఇచ్చాయి: "మైదానాల్లో నీకు భద్రత ఉండదు. మళ్లీ కొండలమీదికే వెళ్లిపో. అక్కడి వాలుల్లోను, బండరాళ్లల్లోనూ నీకు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ" అని. పీటర్‌కు తన మిత్రుల్నందరినీ వదిలి వెళ్లటం కష్టం అనిపించింది- కానీ తప్పదు! అది వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి, మళ్లీ కొండలపైకి ఎక్కింది.
కానీ వేటగాళ్ళు దాని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. దాని జాడ పట్టుకొని వచ్చిన వేటగాళ్ళు కొందరు దాని వెంటపడి తరమటం మొదలెట్టారు. పీటర్ బండరాళ్ల మీదినుండి దూకుతూ, ఇంకా ఇంకా పైకి పోయింది. వేటగాళ్ళు కూడా బాగా అలిసిపోయారు; కానీ వాళ్ళూ పట్టు విడవలేదు. చివరికి పీటర్‌కు ఇక ఎటూ పోలేని పరిస్థితి ఎదురైంది- అది ఇప్పుడొక కొండచరియ కొన కొమ్మున ఉన్నది! వెనక్కి తిరిగితే వేటగాళ్ళు! ముందుకు, అనంతంగా విస్తరించిన మంచుకొండల లోయ! ఆ లోయలోకి పడితే తన ఎముకలు కూడా మిగలవని భయం వేసింది పీటర్‌కు. కానీ ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు- వేటగాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు- అది లేని శక్తిని తెచ్చుకొని, కళ్ళు మూసుకొని, కొండ చరియ మీదినుండి లోయలోకి దూకేసింది!
ఆశ్చర్యం! దానికి ఏమీ కాలేదు! కనీసం చర్మం కూడా దోక్కుపోలేదు! ఎముకలు విరగటం అటుంచి, కనీసం ఒక్క వెంట్రుక కూడా కదల్లేదు! అది పోయి, నేరుగా కొండవాలులో పేరుకున్న మంచుమీద పడింది. అప్పటివరకూ అది ఉపయోగం లేనివీ, అసహజమైనవీ అనుకున్న దాని కొమ్ములే మొదట నేలకు తగిలి, జారాయి- చెక్కలాంటి ఆ కొమ్ములమీద, పీటర్ ఆ కొండ వాలున జారటం మొదలెట్టింది. పేరుపొందిన ఆటగాళ్ళు కాళ్లకు చెక్కలు కట్టుకొని మంచుమీద 'స్కీయింగ్' చేసినట్లు, ఈ గొర్రె, తనకు స్వత:సిద్ధంగా వచ్చిన కొమ్ములమీద స్కీయింగ్ మొదలుపెట్టింది!
జారే వేగం పెరిగినకొద్దీ అది కొంచెం భయపడింది, కానీ కొంచెం తేరుకునే సరికి, పీటర్‌కు ఈ ఆట చాలా నచ్చింది! అది ఇప్పుడు అటూ ఇటూ వంగి, తన ప్రయాణదిశను మార్చుకోగల్గుతున్నది! అలా కొమ్ములమీదే వేగంగా జారుతూ అది దారిలో ఎదురైన ఆటంకాలను కూడా ప్రక్కకు తప్పించటాన్ని సాధన చేసింది!ఇది ఎంత బావుండిందంటే, అది తన కష్టాలన్నిటినీ మరచిపోయి ఆ ఆటలో మునిగిపోయింది! అలా పోయి పోయి, చివరికి అది ఒక చదును ప్రదేశం చేరుకున్నది. అక్కడ రంగు రంగుల జెండాలూ, గుడారాలూ, తోరణాలూ వేసుకొని, వాయిద్యాలు వాయిస్తూ, గాలి పటాలు, బెలూన్లు ఎగరేస్తూ చాలామంది మనుషులు- సంతోషంగా చప్పట్లు చరుస్తూ దానికి స్వాగతం పలికారు!
నిజానికి ఏం జరిగిందంటే, పీటర్ దూకిన ఆ కొండ చరియ, ఆ ప్రాంతంలో ఉన్న వాలుల్లోకెల్లా ఎత్తైనది. ఆ కొండవాలున ప్రతిఏటా స్కీయింగ్ పోటీలు జరుపుతుంటారు. అయితే అన్ని సంవత్సరాల చరిత్రలోనూ, పీటర్ దూకినంత ఎత్తునుండి ఆ వాలుపైకి దూకిన యోధులే లేరు! మహామహులైన మనుష్యులెవ్వరూ సాధించని ఘనతను ఒక కొండగొర్రె సాధిస్తుంటే, చూసినవాళ్లంతా ముక్కున వేలు వేసుకున్నారు. పీటర్ అందరి రికార్డులనూ బ్రద్దలుకొట్టి, మొదటి స్థానంలో నిల్చింది! వాళ్లందర్నీ చూసి పీటర్ భయపడి పారిపోయేందుకు ప్రయత్నించింది- కానీ వాళ్ళు దాన్ని ముట్టి, తట్టి, బుజ్జగించి, మెచ్చుకొని, దాని మెడలో 'మొదటి స్థానం' అని రంగురంగుల 'మెడల్' వేసే సరికి, దానికి ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చింది. తర్వాత ఆ పోటీ నిర్వాహకులు పీటర్‌కు రావలసిన బహుమతి డబ్బుల్ని దాని సంరక్షణకోసం కేటాయించారు కూడాను! దానితో పీటర్ ఆపైన నిశ్చింతగా బ్రతికింది. ఒకప్పుడు భారంగా తోచిన వింత కొమ్ములే తనకు తోడు-నీడ అయ్యేసరికి అది ఆశ్చర్యపోయింది!

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

Post a Comment

0Comments

Post a Comment (0)