melu ku keedu telugu lo stories kathalu మేలుకు కీడు-కీడుకు మేలు

Blogger Passion
By -
0
melu ku keedu telugu lo stories kathalu మేలుకు కీడు-కీడుకు మేలు

మేలుకు కీడు-కీడుకు మేలు
---------------------------
పొరుగూరిలో పని. అడవిగుండా వెళ్ళాలి. సాయంత్రం పూట అటుగా ఎవ్వరూ వెళ్ళరు. అయినా తప్పదు. బయలుదేరి పోయాడు ఆశారాం. చీకటిలో దారి సరిగా కనిపించలేదు. దారి తప్పాడు. చివరికి జంతువుల్ని వేటాడేందుకు ఎవరో వేటగాళ్ళు తవ్విన గుంటలో పడిపోయాడు.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
మొదట్లో బాగా గట్టిగా అరిచాడు. ఏడ్చాడు. తన్నుకులాడాడు. 'పైకి ఎలా ఎక్కి రావచ్చు?' అని ఆలోచించాడు. ఏమీ లాభం లేకపోయింది. రాను రాను ఆకలైంది. చివరికి ఆకలి చచ్చిపోయింది. భయం వేసింది. తర్వాత ఆ భయమూ పోయింది. 'తనను ఎవ్వరూ కాపాడరు' అని నిరాశ కూడా వచ్చింది ఆశారాంకు. నీరసంతో అరుపులు కాస్తా మూలుగులైనాయి.
రెండు రోజులు గడిచాయి. అటుగా ఎవ్వరూ రాలేదు. లేని శక్తిని కూడగట్టుకొని గట్టిగా మూలిగాడు ఆశారాం. అతని అదృష్టం బాగున్నట్లుంది. సరిగ్గా ఆ సమయానికి అటుగా వెళ్తున్న విష్ణువర్మకు ఆ మూలుగు వినబడింది!
విష్ణువర్మ మంచివాడు. జమీందారు గారి దగ్గర పాలేరు. 'ఇక్కడ ఎవరో‌ ఉన్నట్లున్నారు' అని అంతటా వెతికాడు. చివరికి ఆ గుంటలో కనిపించాడు ఆశారాం. దెబ్బలతో, భయంతో, నీరసించిపోయి ఉన్నాడు పాపం.
విష్ణువర్మ వెంటనే అతన్ని బయటకు లాగాడు. తను తెచ్చుకున్న రొట్టెలను పెట్టి తినమన్నాడు. వెతికి దగ్గర్లో ఉన్న సరస్సునుండి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. అతను తేరుకున్నాక, అతన్ని తన గుర్రం మీద ఎక్కించుకొని వేగంగా ప్రయాణించాడు.
ఇంకో గంటకే బాగా అలసిపోయాడు విష్ణువర్మ కూడా. "మిత్రమా! బాగా అలసటగా ఉంది. ఇక్కడెక్కడైనా ఆగి కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. నా చేతిలో జమీందారు గారి డబ్బుంది. అందుకని కొంత జాగ్రత్త అయితే అవసరం. ముందు నేను పడుకొని కొంచెం సేపు కునుకు తీస్తాను. ఆ సమయంలో నువ్వు కాపలాగా ఉన్నావంటే, ఆ తర్వాత నువ్వు పడుకున్నప్పుడు నేను కాపలా ఉండచ్చు. అట్లాగైతే జంతుభయం కూడా ఉండదు!" అన్నాడు విష్ణువర్మ."సరే, దానిదేముంది- మీరు నా ప్రాణ దాతలు. బాగా అలసిపోయినట్లు తెలుస్తూనే ఉంది. ముందు పడుకొని విశ్రాంతి తీసుకోండి. నేనున్నానుగా, కాపలాకు?" అన్నాడు ఆశారాం.
పడుకోగానే గాఢమైన నిద్ర పట్టింది విష్ణువర్మకు. కాపలాగా కొంతసేపు కూర్చోగానే ఆశారాంకి ఆలోచనలు మొదలయ్యాయి. "విష్ణువర్మ దగ్గర జమీందారు గారి డబ్బు ఉందట! చూడు! అదే సొమ్ము నీ దగ్గర ఉంటే నీకు ఈ ఖర్మ పట్టేదా? అసలు నువ్వు ఈ అడవిలోకి వచ్చేవాడివా, గుంతలో పడేవాడివా? దేనికైనా డబ్బు అవసరం..! ఇదే అవకాశం. వీడి దగ్గరున్న సొమ్మును తీసుకొని పారిపో... ఎవ్వరూ ఏమీ అనరు!” అని మనసు లోపలి భూతాలు కూశాయి.
చెడు కూతలకు లొంగిపోయిన ఆశారాం పరికించి చూశాడు. విష్ణువర్మ మంచి నిద్రలో ఉన్నాడు. అతన్ని నిద్ర లేపకుండా మెల్లగా అతని తలపాటున సంచీలో ఉన్న డబ్బును తీసుకొని పరుగు పెట్టాడు ఆశారాం.
విష్ణువర్మ లేచేసరికి సాయంత్రం కావస్తున్నది. 'ఇంత మొద్దు నిద్ర పట్టిందేమిటి?' అని అతను తటాలున లేచి చూసేసరికి ఆశారాం లేడు! కొద్ది సేపు అతని కోసం వెతికాక, అప్పుడు గమనించాడు విష్ణువర్మ- సంచీలో ఉండాల్సిన జమీందారు గారి డబ్బు కూడా లేదు!
దాంతో కొద్ది సేపటివరకూ ఏం చేయాలో తెలియలేదు అతనికి. "వెనక్కి తిరిగి పోదామంటే తన కోసం జమీందారు గారు ఎదురు చూస్తుంటారాయె! ఈ ఆశారాం తన గుర్రాన్నయితే తీసుకెళ్లలేదు- మంచిదైంది. ఊరు చేరాక, దీన్ని అమ్మి అయినా సరే, జమీందారుగారి సొత్తు జమీందారు గారికి ఇస్తాను. ఇప్పుడైతే సాయంత్రం కావస్తున్నది. ఇంకా ఆలస్యం అయితే చీకటి పడిపోతుంది! ఆలోగా అడవిని దాటాలి!” అని ఏడుపు మొహంతో వేగంగా బయలు దేరాడు విష్ణువర్మ.కొద్ది దూరంలోనే అతనికి ఒక దృశ్యం కనబడింది- తుప్పల మాటున నలుగురు మనుష్యులు నిలబడి ఎవరో ఒక బాటసారిని కట్టెలతో బాదుతున్నారు-
"ఏయ్! ఎవరది?! నేను జమీందారు గారి మనిషిని! ఇంతటితో మీ పని సరి!” అంటూ గుర్రాన్ని అటువైపుకు దూకించాడు విష్ణువర్మ.
ఆ మాటలు వినగానే దోపిడీ దొంగలంతా ఎటుపడితే అటు పరుగులు పెట్టారు. తీరా దగ్గరకు వెళ్ళి చూస్తే వాళ్ళకు చిక్కి తన్నులు తింటున్నది వేరెవరో కాదు- ఆశారామే! విష్ణువర్మను చూసి, తను ఎత్తుకెళ్ళిన డబ్బుల కట్టను అతని చేతుల్లో పెట్టి సిగ్గుతో తలదించుకున్నాడు అతను-
"మిత్రమా! క్షమించు. గుంటలో పడి అలమటిస్తున్న నన్ను నువ్వు కాపాడావు. అయినా దురాశ కొద్దీ నేను నీ దగ్గరున్న డబ్బును దొంగిలించాను. ఇప్పుడు నువ్వు నన్ను మరోసారి కాపాడావు.. నీ మంచితనం ముందు నేనెంతవాడినో అర్థమైంది. నన్ను తీసుకెళ్ళి జమీందారుకు అప్పగించు. నమ్మిన వారిని మోసం చేసిన నాకు ఎంత కఠినమైన శిక్ష విధించినా చాలదు..” అని ఏడ్చాడు ఆశారాం.
“జమీందారు గారి డబ్బు తీసుకెళ్ళావని తప్ప, నీమీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపమూ లేదు. నాతో పాటు గుర్రం ఎక్కు. అడవి దాటినాక నీ దారిన నువ్వు పోవచ్చు” అన్నాడు విష్ణువర్మ దయతో.
"వద్దులెండి. నాకు బుద్ధి వచ్చింది. ఇకమీద మోసాలు చేయను- నీతివంతమైన జీవితం‌ గడుపుతానని మాట ఇస్తున్నాను. మీరిక వెళ్లండి" అంటూ కన్నీళ్లతో అతన్ని సాగనంపాడు మారిపోయిన ఆశారాం.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

Post a Comment

0Comments

Post a Comment (0)