What is in which Part of Sri Mahabharata? #శ్రీ_మహాభారతం_ఏ_పర్వంలో_ఏముంది?

What is in which Part of Sri Mahabharata? #శ్రీ_మహాభారతం_ఏ_పర్వంలో_ఏముంది?

#శ్రీ_మహాభారతం_ఏ_పర్వంలో_ఏముంది? - What is in which Part of Sri Mahabharata?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి.. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు.. కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటి వారికి అవగాహన కోసం...


1. #ఆది_పర్వం:

రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్ర వీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆది_పర్వం వివరిస్తుంది.


2. #సభా_పర్వం:

పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయ యాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు.


3. #అరణ్య_పర్వం:

దీనినే వన పర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నల దమయంతుల కథ, సావిత్రి సత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి.


4. #విరాట_పర్వం:

విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది.


5. #ఉద్యోగ_పర్వం:

ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతి యత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధ సన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు.


6. #భీష్మ_పర్వం:

మహాభారతంలో ఆరవది భీష్మ పర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పది రోజుల యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి.


7. #ద్రోణ_పర్వం:

ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధి లేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేసి వీర మరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీర మరణం ఇతర ముఖ్యాంశాలు.


8. #కర్ణ_పర్వం:

కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీర మరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు.


9. #శల్య_పర్వం:

మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమ దుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు.


10. #సౌప్తిక_పర్వం:

ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు.


11. #స్త్రీ_పర్వం:

వీరమరణం పొందిన కురు పాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది.


12. #శాంతి_పర్వం

13. #అనుశాసనిక_పర్వం

ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్ర నామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి.


14. #అశ్వమేధ_పర్వం:

శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు.


15. #ఆశ్రమవాస_పర్వం:

కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు.


16. #మౌసల_పర్వం:

యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి.


17. #మహాప్రస్థాన_పర్వం:

పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది.


18. #స్వర్గారోహణ_పర్వం:

భీమార్జున, నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం..


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



Post a Comment

0 Comments